Bird flu : ఏపీలో బర్డ్ ఫ్లూ టెన్షన్.. వేలాది కోళ్లు మృత్యువాత
X
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. తాజాగా నెల్లూరు జిల్లాలో వేలాది కోళ్లు ఉన్నట్లుండి చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మృతిచెందిన కోళ్ల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం భోపాల్ ల్యాబ్‌కు పంపారు. అయితే కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రత్యేక చర్యలు చేపట్టారు.
బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో చికెన్ కొనుగోళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో చికెన్ సెంటర్లు ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. చికెన్ ధరలు కూడా అమాంతం పడిపోవడంతో వ్యాపారాలు ఆందోళన చెందుతున్నారు. అయితే నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఎటువంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.
ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ షాపులను మూసివేయడంతో పాటుగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి వ్యాధిపై ప్రచారం కల్పిస్తున్నారు. ఒకవేళ కోళ్లు చనిపోతూ ఉంటే వాటిని ఖననం చేసేయాలని కోరుతున్నారు. ఈ బర్డ్ ఫ్లూ అంటు వ్యాధిని అరికట్టేందుకు ఇప్పటికే 37 బృందాలు రంగంలోకి దిగాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.