బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చూపిస్తూ మెదడుకు శస్త్రచికిత్స
X
డాక్టర్లు రోజుకు ఎన్నో కేసులు చూస్తుంటారు. మరెన్నో క్లిష్టతరమైన ఆపరేషన్లు సైతం చేసి రోగుల ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ ముఖ్యంగా మెదడుకు సంబంధించిన ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్లు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే పేషెంట్ మెలకువగా ఉన్న సమయంలోనే తలకు సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో కొన్నిసార్లు డాక్టర్లు సినిమాలను చూపిస్తూ మెదడుకు ఆపరేషన్ చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలా పలు సినిమాలు, కార్యక్రమాలు పేషెంట్ కి చూపిస్తూ చేసిన ఆపరేషన్లు ఎన్నో సక్సెస్ అయ్యాయి.
అలాంటి సర్జరీనే గుంటూరు అరండల్‌పేటలో చోటు చేసుకుంది. అతనికి ఎంతో ఇష్టమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపిస్తూ సర్జరీ చేశారు. దివ్య తేజస్సుతో రామ్ లల్లా కొలువుదీరడాన్ని టీవీలో చూస్తూ భక్తితో పరవశం చెందాడు. ఆ సమయంలోనే డాక్టర్లు సర్జరీ పూర్తి చేయడం విశేషం. శ్రీసాయి హాస్పిటల్‌లో అత్యంత ఖరీదైన ఈ సర్జరీని పూర్తి ఉచితంగా చేశామని న్యూరోసర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన మణికంఠ మెదడులో 7 సెం.మీ పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు వైద్యులు. వెంటనే మణికంఠ మెదడు త్రీ-డీ మ్యాప్ తయారుచేసుకున్నట్లు చెప్పారు. కుడి చేయి, గొంతు, మాటల పనితీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో కణితి ఉందన్నారు. దీంతో పేషెంట్ మెలకువగా ఉన్న సమయంలోనే మెదడుకు సర్జరీ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 11వ తేదీన ఓ వైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే మరోవైపు రోగికి ఇష్టమైన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపించినట్లు చెప్పారు. పేషెంట్ స్పృహలో మాట్లాడుతుండగానే మెదడుకు సర్జరీ పూర్తి చేసి కణితిని తొలగించామని వైద్యులు అన్నారు. శస్త్రచికిత్స మధ్యలో రెండు చేతులతో బాలరాముడికి నమస్కరించినట్లు చెప్పారు. పేషెంట్ పూర్తిగా కోలుకున్నందున హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జి చేశామని డాక్టర్లు తెలిపారు.