BTech Ravi : అర్థరాత్రి హై డ్రామా.. బీటెక్ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు
X
మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కడప మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బీటెక్ రవిని కడప జైలుకు తరలించారు. దాదాపు 10 నెలల క్రితం (జనవరి 25) నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా.. కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ కు స్వాగతం పలకడానికి భారీ ర్యాలీతో బీటెక్ రవి కడప ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. ఈ క్రమంలో బీటెక్ రవిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా పది నెలల తర్వాత పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఘర్షణ కేసులో రవిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ షరీఫ్ తెలిపారు. ఆ ఘటనలో తమ ఏఎస్ఐకి గాయాలు అయ్యాయని చెప్పారు.
మంగళవారం సాయంత్రం కడప నుంచి పులివెందుల వస్తున్న రవిని పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. విషయం తెలియని కుటుంబ సభ్యులు రవి కిడ్నాప్ అయినట్లుగా భావించి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే రవి గురించి తమకేమీ తెలియదని, వివరాలు తెలుసుకుంటామని పోలీసులు చెప్పి పంపారు. పోలీసులు రవిని ఏదో కేసులో అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తుండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రవి కనిపించకపోడంతో నిన్న రాత్రి పులివెందులలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో తమా రవిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. వైసీపీ శ్రేణుల నుంచి, పోలీసుల నుంచి తమ ముప్పు ఉందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రవికి ప్రాణహాని కలిగించే అవకాశముందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) పులివెందులో టీడీపీకి పెద్ద అండ. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందను ఓడించిన రవికి కడప జిల్లాలో టీడీపీ ఉనికి చాటడడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు.