Home > ఆంధ్రప్రదేశ్ > టీటీడీ చైర్మన్ పదవికి అగ్రవర్ణాలవారే అర్హులా? బీసీలకు ప్రసాదం, దళితులకు ‘గోవిందం’తో సరా?

టీటీడీ చైర్మన్ పదవికి అగ్రవర్ణాలవారే అర్హులా? బీసీలకు ప్రసాదం, దళితులకు ‘గోవిందం’తో సరా?

టీటీడీ చైర్మన్ పదవికి అగ్రవర్ణాలవారే అర్హులా? బీసీలకు ప్రసాదం, దళితులకు ‘గోవిందం’తో సరా?
X

దేవుడికి వివక్ష లేదు. భక్తికి మించిన మతం లేదు. భక్తుల కొంగు బంగారం, కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుడు మరింత దయాళువు. బీబీ నాంచారిని పెళ్లాడినా, ‘గొల్ల మిరాసి’ కింద గొల్లలతో తలుపు తెరిచి మూయించుకున్నా ఆయనకే చెల్లింది. ‘ఏడుకొండలవాడా, గోవిందా గోవిందా’ అని మొక్కుకుంటే చాలు ఎవరి కోరికలైనా నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. కానీ ఆ దేవర వారి సామ్రాజ్యాన్ని ఏలుతున్న నాయకులు మాత్రం కుల వివక్షను, స్వకుల పక్షపాతాన్ని నిస్సిగ్గుగా పాటిస్తున్నారు. ఎంపిక చేసినట్టు కేవలం కొన్ని కులాల వారికి మాత్రమే పెత్తనం కట్టుబెడుతున్నారు.

తొలి నుంచీ అంతే..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. భూమన 2006-08 మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు. తాజా మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జగన్ కుటుంబపు వ్యక్తే. సబ్బారెడ్డి తర్వాత బీసీలకు ఆ పదవి దక్కుతుందని వైసీసీ వర్గాలు లీకులు ఇచ్చాయి. చివరికి మళ్లీ రెడ్డికే ఆ పదవి దక్కింది. నిజానికి టీటీడీ బోర్డు మొదలైనప్పట్నుంచీ చైర్మన్ పదవుల్లో ఒకరిద్దరు బీసీలను మినహాయిస్తే అగ్రవర్ణాల వ్యక్తులే ఆ పదవిలో నియమితులయ్యారు. చదలవాడ కృష్ణమూర్తి, డీకే ఆదికేశవుల నాయుడు, పప్పల చలపతిరావు, టి. సుబ్బరామిరెడ్డి వంటివారంతా ‘పై కులాల’ వాళ్లే. వైవీ సుబ్బారెడ్డికి ముందు ఆ పదవి చేపట్టిన పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం బీసీ. ఆయన 14 నెలలే పనిచేశారు.

భక్తి రాజకీయం

టీటీడీ ప్రభుత్వ పెత్తనం కింద పనిచేస్తుంది కాబట్టి రాజకీయాలకు తగ్గట్టే నియామకాలు ఉంటాయనడంతో సందేహం లేదు. కాకపోతే అన్ని కులాల భక్తులూ దర్శించుకుని, వేల కోట్ల రూపాయల కానుకలు సమర్పించే గుడిలో అన్ని హైందవ కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. అయితే కమ్మ, లేకపోతే రెడ్డి, ఇంకాలేకపోతే కాపు..నూటికో కోటికో ఒక్కడన్నట్లు బీసీ తప్ప సామాజిక న్యాయం పాటించడం లేదు. వెంకటేశ్వర స్వామిని దళితులకు చేరువ చేయడానికి ‘దళితం గోవిందం’ పేరుతో వెలివాడల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నా ధర్మకర్తలకు, ధర్మకర్తలపైనున్న ప్రభుత్వానికి ఒక దళితులకు టీటీడీ చైర్మన్ పదవిని అప్పగించడానికి మనసు రావడం లేదు. కొన్ని దశాబ్దాలుగా కమ్మ, రెడ్లి నాయకులు అనుభవిస్తున్న ఈ పదవిని జగన్ తన సంచలన నిర్ణయాల్లో భాగంగా ఈసారి కచ్చితంగా బీసీ వ్యక్తికి కట్టబెడతారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. అయితే బీసీల్లో, దళితుల్లో అర్హులే లేనట్లు మళ్లీ భూమనకు ఇవ్వడంతో వైసీపీలోని బీసీ నేతలే అవాక్కవుతున్నారు. చంద్రబాబు హయాంలో కమ్మలకు, వైఎస్ హయాంలో, ఇప్పుడు ఆయన తనయుడి హయంలో రెడ్లకు మాత్రమే ఈ పదవి హక్కుభుక్తం కావడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని, వెంకన్న అందర్నీ చల్లగా చూస్తాడని సణుక్కుంటున్నారు. ‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటె, అంటనే బంటునిద్ర అదియునొకటె మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె, చండాలుడుండేటి సరిభూమి యొకటే’ అనే అన్నమయ్య సమానత్వం పాటను విషాదంగా పాడుకుంటున్నారు.



Updated : 6 Aug 2023 12:09 PM IST
Tags:    
Next Story
Share it
Top