వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేస్తా : సీబీఐ మాజీ జేడీ
X
వచ్చే ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. గతంలో పోటీ చేసినప్పుడు విశాఖ ప్రజల స్పందన బాగుందని.. అందుకే ఈ సారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. అయితే ఇప్పటివరకు తనను ఏ పార్టీ ఆహ్వానించలేదన్నారు. తాను పలు పార్టీల్లో చేరుతున్నానంటూ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో నిజం లేదని చెప్పారు.
సరికొత్త రాజకీయాలు రావాలని లక్ష్మీనారాయణ అన్నారు. యువత ఓటేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బుతో పాటు ఇతర అంశాలకు ప్రాధాన్యత పెంచుకుంటూ పోతుంటే.. రాజకీయాలు అంటే ఇవేనని యువత నిరుత్సాహానికి లోనవుతున్నారని చెప్పారు. యువతపై సానుకూల ప్రభావం చూపే రాజకీయాల కోసం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలను అమలు చేసే ప్రభుత్వాలు రావాలే తప్ప సొంత ఆలోచనలను ప్రజల మీద రుద్దే ప్రభుత్వాలు రావొద్దని అన్నారు.