ఏపీ సర్కార్ నిధుల మళ్లింపు.. కేంద్రం సీరియస్
X
గృహ నిర్మాణ నిధుల దారి మళ్లించిన ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ అయ్యింది. దారిమళ్లించిన నిధులను వెంటనే ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.1,879 కోట్లు విడుదల చేసింది. అయితే ఏపీ సర్కార్ రూ.1,039 కోట్ల నిధులను దారిమళ్లించడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కనీసం జీవో లేకుండా ఈ నిధులను దారిమళ్లించడంపై కేంద్రం అభ్యంతరం తీవ్ర వ్యక్తం చేసింది. తక్షణమే సింగిల్ నోడల్ ఖాతాకు ఈ నిధులు రీయింబర్స్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం 1.5కోట్లు మాత్రమే ఉన్నాయి. కేంద్రం విడుదల చేసిన రూ.1,879 కోట్ల నుండి రూ.639 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.385 కోట్లతో పాటు రూ.113 కోట్ల మేర బిల్లులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ బకాయి పెట్టింది.
పీఎం అవాస్ యెజనలో రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం ఇవ్వాల్సిన 1174 కోట్ల నిధుల్ని ఆపేసింది. ఇదే సమయంలో పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో జగనన్న లే అవుట్లలో నీటి సరఫరా పనులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలోని 2.34 లక్షల ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది.