అహంకారానికి పోతే ఏవుతుందో తెలంగాణలో చూశాం.. చంద్రబాబు
X
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు నెలల్లో తెలంగాణలో వచ్చిన పరిస్థితే వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైల్లో పెడుతున్నారని, తనను జైలుకు పంపడంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగులో వర్షాల్లో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పంట బీమా కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న జగన్ ప్రభుత్వం రైతులను ఎలా ఆదుకుంటుందని ప్రశ్నించారు.
‘‘మన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చాలా అహంకారంతో ప్రవర్తిస్తోంది. అహంకారానికి పోతే ఏమవుతుందో తెలంగాణలో చూశాం. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుంది. నేను ఏ తప్పూ చేయకుడా జైల్లో వేశారు. నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. రైతులకు నేను అండగా నిలబడతాను. మూడు నెలల తర్వాత ఆదుకుంటాను’’ అని హామీ ఇచ్చాచ్చారు. దేశంలో బాగా నష్టపోయింది ఏపీ రైతులేనని చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఏపీలో సగం మంది రైతులు పంటలు వేయలేదని, వేసిన పంటలు కాస్తా తుపానులో దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రైతులను పరామర్శిస్తున్న విషయం తెలిసిన జగన్ హడావుడిగా పరామర్శలకు బయల్దేరాని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన మంత్రులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు సందేశం పంపారు.