చంద్రబాబు నోటివెంట ఆ మాటలు వింటుంటే కిక్కొస్తుంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత తమదేనని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది కూడా తామేనని తెలియజేశారు. హైటెక్ సిటీ, రింగ్ రోడ్, సైబరాబాద్ నిర్మాణాలను చేపట్టి, హైటెక్ సిటీని తెలంగాణ ఆర్ధిక వనరుగా మార్చడంలో తమ ముందు చూపు ఉందని చెప్పుకొచ్చారు. ‘తెలంగాణకు కట్టు బొట్టు చేర్పించాం. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు తామే నేర్పాం. రాష్ట్రంలో నగరాలను డెవలప్ చేశాం’ అంటూ భుజాలు గుద్దుకున్నాడు చంద్రబాబు.
ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. పలువురు రాజకీయ నేతలు చంద్రబాబు మాటలు వెన్నక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీహబ్ ను మొదలుపెట్టి ప్రపంచ సంస్థలను హైదరాబాద్ వైపు చూసేలా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చంద్రబాబు మాటలకు కౌంటర్ ఇచ్చారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నోటి వెంట.. ‘ప్రస్తుతం ఆంధ్రా కన్నా తెలంగాణ మేలు’ అనే మాటలు రావడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, చంద్రబాబు ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో ఏపీని పోల్చుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘తెలంగాణలో వరి ఉత్పత్తి పెరిగింది. ఏపీలో వరి ఉత్పత్తి తగ్గింది. ఏపీలో 10 లక్షల టన్నుల వరి ఉత్పత్తి తగ్గితే.. తెలంగాణలో 90 లక్షల టన్నుల వరి ఉత్పత్తి పెరిగింది. తెలంగాణలో కష్టం అయినా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం వాళ్లు కట్టుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. అవికాస్త వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ పట్టుకున్న తెలంగాణ నేతలు.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ‘చంద్రబాబు ఇప్పుడు మేలుకున్నాడు. ఇకనైనా మా వల్లే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ప్రచారం చేసుకోవడం ఆపుతార’ని ఎద్దేవా చేస్తున్నారు.