జగన్ చివరికి నీకు మిగిలేది మొండి ఫ్యానే..Chandrababu Naidu
X
జగన్ కు చివరికి మిగిలేది మొండి ఫ్యాన్ మాత్రమేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు నెల్లూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు ఆయన హాజరయ్యారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధితులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ వంటి వ్యక్తి కూడా జగన్ బాధితుడయ్యాడని తెలిపారు. గల్లా జయదేవ్ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారన్నారు. అమరరాజా పరిశ్రమపై దాడులు చేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయేలా చేశారని చెప్పారు. ఒక రాజకీయ కుటుంబం..అసలు రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని వివరించారు.
జగన్ నాయకత్వంలో ప్రజల జీవితాల్లో ఏ మాత్రం మార్పు అనేదే రాలేదని విమర్శించారు. అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీ అగ్రస్థానానికి చేరిందన్నారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో కూడా ఏపీనే ముందుందని చెప్పుకొచ్చారు. నిరుద్యోగం విషయంలోనూ ఏపీ మిగతా రాష్ట్రాలను వెనక్కి నెట్టిందని, 24 శాతంతో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. అంతేగాక దేశంలోని అందరు ముఖ్యమంత్రుల కంటే రిచెస్ట్ సీఎంగా జగన్ తయారయ్యారని..కానీ తాను మాత్రం ఇంకా పేదబిడ్డనని చెప్పుకుంటుంటారని ఎద్దేవా చేశారు.
జగన్ అర్జునుడు కాదు, భస్మాసురుడని చురకలంటించారు. భస్మాసుర వధ చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకానిదని స్పష్టం చేశారు. ప్రజలంతా కలిసి తొందర్లోనే జగన్ ఫ్యాన్ మూడు రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారని విమర్శించారు. ఫ్యానులో బాదుడు రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు, హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు, విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారేస్తారని మండిపడ్డారు. జగన్ కు చివరికి మిగిలేది మొండి ఫ్యానేనని చెప్పారు. అంతేగాక తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తీరిగ్గా కూర్చుని బాధపడే రోజు తొందరల్లోనే వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.