Chandrababu : సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్..
X
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార -విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు సీఎం జగన్.. ఇటు చంద్రబాబు వరుస సభలతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాప్తాడు సిద్ధం సభలో టీడీపీ-జనసేనపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింకులో ఉండాలని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని ప్రజల రక్తం తాగడానికి వస్తున్నారని విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం పాలన ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. జగన్కు దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎవరిది స్వర్ణయుగమో.. ఎవరిది రాతియుగమో ఆ చర్చలో తేల్చేద్దామన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు చివరి ఛాన్స్ అని ఎద్దేవా చేశారు. సైకిల్ బయట ఉండడం కాదు.. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టేందుకు జనం సిద్ధం ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతో మార్పులు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టారని.. మిగితా వారిని మడతపెడతారని విమర్శించారు.