చంద్రబాబుకు హైకోర్టులో ఊరట..
X
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం దొరికింది. ఆయనను సీఐడీ కస్టడీకి అప్పగించడానికి కోర్టు నిరాకరించింది. వచ్చే సోమవారం వరకు బాబును కస్టడీలోకి తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. బాబుకు బెయిల్ కోరుతూ ఆయన లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. తన క్లయింట్ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవు కనుక ఎఫ్ఐఆర్ కొట్టేయాలని, సీఐడీ కస్టడీకి అప్పగించవద్దని బాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. బాబును అరెస్ట్ విషయంలో నిబంధనలను పాటించలేదని, గర్నర్ అనుమతి తీసుకోలేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాబు నేరానికి పాల్పడ్డారని నిరూపిస్తామని, విచారణ ప్రాథమిక దశలో ఉందని ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ చెప్పారు. దీంతో కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో వాస్తవాలను తెలుసుకునేందుకు సమయం పడుతుందని, ఇరుపక్షాల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో విచారణ మంగళవారానికి వాయిదాపడింది. విచారణ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తను గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశానని, దీనిపై అభ్యంతరాలు ఉంటే విచారణను వేరే బెంచికి బదీలి చేస్తానని జడ్జి.. చంద్రబాబు న్యాయవాదికి చెప్పారు. నాట్ బిఫోర్ మీ కింద విచారణ నుంచి తప్పుకుంటానని అన్నారు. అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లూథ్రా అన్నారు. శనివారం అరెస్టయిన బాబు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్లో జైల్లో ఉన్నాయి. వీఐపీ ఖైదీ కావడంతో ఆయనను ప్రత్యేక వార్డులో ఉంచి గట్టి భద్రత కల్పించారు.