Skill Development Corporation Case: చంద్రబాబు అరెస్ట్: నమోదైన సెక్షన్‌లు ఇవే
X
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఈ రోజు ఉదయం 5 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
చంద్రబాబు సీఎంగా 2015లో స్కిల్ డెలవప్మెంట్ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం జరిగింది. రూ.3,356 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయంలో రూ.371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు రాగా.. 2020 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబరు 10న విజిలెన్స్ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్ 9న ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏకంగా 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది.ఈడీ నోటీసులు అందుకున్న వారంతా 2014 నుంచి 2019 మధ్యన సాగిన తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కీలకమైన భూమిక పోషించారు అని ఈడీ గుర్తించింది.
అసలు ఈ కుంభకోణం ఏమిటి అన్నది చూస్తే.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ అప్పట్లో కీలకమైన ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. ఇందులో పది శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 370 కోట్ల రూపాయలు మొత్తం ఉంటుంది. ఇక్కడే ఈడీ అక్రమాలు జరిగినట్లుగా గుర్తించింది. ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారి మళ్లినట్లు ఈడీ అధికారులు కనుగొనడంతో నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల క్రితం తనను అరెస్ట్ చేయవచ్చంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అదుపులోకి తీసుకోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.