Chandrababu: ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయనకు కోర్టు విధించిన రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. ఈ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆయనను వర్చువల్ విధానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో సెప్టెంబర్ 9న బాబు అరెస్ట్ అయ్యారు. అప్పుడు కోర్టు 22వరకు రిమాండ్ విధించగా.. ఆ తర్వాత మరో రెండు రోజులు దానిని పొడిగించింది. సెప్టెంబర్ 24న మరోసారి కోర్టులో హాజరుపరచగా.. అక్టోబర్ 5వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
మరోవైపు డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై కాసేపట్లో విచారణ జరిగనంది. బుధవారం ఉదయం నుంచి బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున అడ్వొకేట్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదని కోర్టుకు విన్నవించారు. కనీసం కండీషన్ బెయిల్ అయినా ఇవ్వాలని కోర్టును కోరారు. పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని విదేశాలకు పారిపోవడానికి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని విన్నవించారు
అనంతరం సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కాంకు పాల్పడ్డారన్న ఆయన.. కేబినెట్ ఆమోదంతో ఎంఓయూ జరిగిందనడం అవాస్తవమని కోర్టుకు విన్నవించారు. విదేశాలకు పారిపోయిన బాబు మాజీ పీఏ శ్రీనివాస్ పాస్పోర్ట్ సీజ్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే ఆ పిటిషన్ డిస్మిస్ చేయాలని సుధాకర్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.