వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడితే రాష్ట్రం గెలుస్తుంది : చంద్రబాబు
X
కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడం సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పేదలను దోచేస్తూ పేదల పక్షం అని చెప్పుకోవడం జగన్‌కే చెల్లిందని మండిపడ్డారు. టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడుకి చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ" వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడిస్తేనే రాష్ట్రం గెలుస్తుంది. నాలుగేళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే జరిగే నష్టం ఏమిటో 22ఏ భూముల్లో జరుగుతోన్న దోపిడీ చూస్తే అర్థమవుతోంది. వైసీపీలోని చిన్న చేపలను ఆపార్టీకి చెందిన పెద్ద చేపలే మింగేస్తున్నాయి. ఏపీలో భూముల ధరలు పడిపోయాయి.అభివృద్ధి లేకపోవడంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కియామోటార్స్ వచ్చింది కాబట్టి అనంతపురంలో, అమరావతి వచ్చింది కాబట్టి అక్కడ ల్యాండ్ విలువ పెరిగింది. ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు వస్తే అక్కడ, నేషనల్ హైవే వస్తే అక్కడ భూమి విలువ పెరుగుతుంది. కానీ, ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఆంధ్రాలో ఒకప్పుడు ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనేవాళ్లని..హైటెక్ సిటీ కట్టిన తర్వాత రూ.30వేలు ఉండే ఎకరా రూ.30 కోట్లు అయ్యిందని సీఎం కేసీఆర్ చెప్పారు. పటాన్ చెరులో ఎకరం రూ.30కోట్లు.. అవి పెడితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందన్నారు. వైసీపీ వేధింపులతో కంపెనీలు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ప్రభుత్వం వేధింపులతో అమరరాజా వంటి వారు రాజకీయాలు వదిలేయడం, పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడం చేశారు" అని చంద్రబాబు అన్నారు