Ap Assembly Elections : ఏపీలో ఆ పొత్తు రిపీట్ కానుందా?.. బీజేపీ పెద్దల వద్దకు బాబు
X
(Ap Assembly Elections) ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలు ఒక్కటిగా ముందుకు వెళ్తున్నాయి. పొత్తులు, సీట్ల పంపకాల గురించి ఆ రెండు పార్టీలు ఒక అవగాహనతో ఉన్నాయి. అయితే ఆ రెండు పార్టీలు ఇప్పుడు మరో పార్టీ పొత్తు కోసం ఎదురుచూస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ బీజేపీ తమతో కలిసి వచ్చే అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దల నుంచి పవన్‌కు పిలుపు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో బీజేపీ వ్యవహారంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒంటరిగా పోటీలో ఉంటుందా? లేకుంటే పొత్తులతో పనికానిచ్చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సమయంలో నేడు ఏపీలో పొత్తుల అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు, సీట్ల పంపకాలపై ఓ అవగాహనకు వచ్చాయి. ఒకవేళ బీజేపీ తమతో కలిసి వస్తే సీట్ల పంపకం ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తున్నాయి.
బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై టీడీపీ, జనసేన పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ పెద్దల నుంచి కబురొచ్చింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైతే ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు బాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం రాత్రి కానీ, గురువారం కానీ ఆయన అమిత్ షాతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు.