చంద్రబాబు ప్రధాన కుట్రదారు.. ఏపీ సీఐడీ చీఫ్
X
TDP అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏపీ CID అదనపు డీజీ స్పందించారు. నంద్యాలలో ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన్ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐడీ అదనపు డీజీ మాట్లాడారు. ‘‘ రూ.550 కోట్ల అక్రమాలు జరిగిన కేసులో చంద్రబాబు ఇన్‌వాల్వ్ అయ్యారు. ఏపీలో ఎక్స్‌లెన్స్ సెంటర్లు పెట్టేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అంచనా విలువ రూ.330 కోట్లు. ఇందులో దాదాపు రూ.300 కోట్ల వరకూ ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదల చేసింది. ఈ సొమ్ములో చాలా వరకూ నకిలీ పత్రాల ద్వారా షెల్ కంపెనీలకు బదిలీ చేశారు’’ అని వివరించారు.
ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితమైతే పదేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. ఈ స్కాం లో చంద్రబాబు పాత్ర గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్కిల్ స్కాం పై చంద్రబాబుకు పూర్తి సమాచారం ఉందని తమ వద్ద తగిన ఆధారాలున్నాయన్నారు.అప్పట్లో ప్రభుత్వం నుంచి నిధులు ఏ సంస్థ నుంచి ఎక్కడికి వెళ్లి , ఎలా తమ నేతల వద్దకు చేరాయనే విషయాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయన్నారు. నిధులు విడుదల చేయాలని ఆయనే ఆర్థిక శాఖను ఆదేశించారని తెలిపారు. ఆయన కేంద్రంగానే అన్నీ జరగడంతోనే ఏ1 గా చేర్చామన్నారు. అసలు స్కిల్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం ను స్కాం చేసేందుకే ప్రారంభించారని తెలిపారు. నాటి కేబినేట్ ఆమోదం లేకుండానే స్కిల్ కార్పోరేషన్ ను తీసుకొచ్చిన చంద్రబాబు .. గంటా సుబ్బారావుకు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. గంటా ద్వారానే బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని తెలిపారు. చంద్రబాబును ఈ సాయంత్రం లోపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని సంజయ్ అన్నారు. ఇక ఈ స్కాం లో నారా లోకేష్ సన్నిహితులకు ప్రమేయం ఉందన్నారు. దీనిపై లోకేష్ నూ ప్రశ్నించాల్సి ఉందన్నారు. అటు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ మళ్లింపు కేసుల్లో మాజీ సీఎం తనయుడిపై లోతుగా విచారించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.