నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ ..ఈ నెల 9న ఎన్డీయే గూటికి టీడీపీ !
X
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లునున్నారు. కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షాతో వీరు భేటీ కానుండగా రాష్ట్రంలో బీజేపీతో పొత్తుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కూడా చంద్రబాబు, షా బేటీ కాగా..పొత్తుల క్లారిటీ రాలేదు. నేటి సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ-జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అటు నిన్న బాబు-పవన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైంది. ఈ నెల తొమ్మిదో తేదీన లాంఛనంగా ఆ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరనుందని ఢిల్లీ వర్గలు చెబుతున్నాయి. ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తొంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు లభిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ఆంధ్రలో ఆ పార్టీకి ఒక శాతంలోపే ఓట్లు లభించాయి.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ బలానికి మించి సీట్లు ఇస్తే.. తర్వాత గెలవలేకపోతే వైసీపీ లాభపడుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీ ట్లు ఇవ్వగా.. ఆ పార్టీ 4 చోట్లే గెలిచింది. ఈసారి విజయావకాశాలున్న అభ్యర్థులు ఉన్నచోటే బీజేపీకి సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీడీపీ సర్వే కూడా చేయించింది. ఆ ఫలితాలు కొందరికి అనుకూలం, ఇంకొందరికి ప్రతికూలం గా వచ్చాయి. 3 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లు బీజేపీకివ్వాలని కొందరు టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు.. 99 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. టీడీపీ 94, జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మరో 19 స్థానాలకు జనసేన రెండు మూడురోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 118 స్థానాలు పోగా మిగిలిన స్థానాలలో ఎన్ని బీజేపీకి కేటాయిస్తారనేది ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పొత్తు కుదిరితే మాత్రం అసెంబ్లీ కంటే లోక్‌సభ స్థానాలనే ఎక్కువగా అడగాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.