Chandrababu:ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చింది..
X
ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో టీడీపీ నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆరాచకాలు జరుగుతున్నాయిని, జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు, నాయకులే లక్ష్యంగా బైండోవర్ కేసులతో వేధిస్తోందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అది చూసే నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని, బీఎల్‌వోలుగా మహిళా పోలీసులను పెట్టారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలను సీఈసీకి వివరించామని, తగిన విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు.