లక్ష కోట్ల కుంభకోణానికి చంద్రబాబు స్కెచ్.. సజ్జల కీలక వ్యాఖ్యలు
X
లక్ష కోట్ల కుంభకోణానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లోనే పెద్ద స్కెచ్ వేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఐఎంజీ భారత్ సంస్థ పేరుపై బాబు భారీ స్కెచ్ వేశాడని, అయితే వైెఎస్ మంచితనం వల్ల జైలుపాలు కాలేదన్నారు. బాబు ఒక ఇంటర్నేషనల్ స్కామర్ అని, అమరావతిలోనూ దోపిడీకి పాల్పడ్డారని సజ్జల కామెంట్స్ చేశారు. గుడిని, గుడిలోని లింగాన్ని కూడా స్వాహా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
అమెరికాలో ఉన్న ఐఎంజీ అనే స్పోర్ట్స్ అకాడమీ పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను 2003 ఆగస్టులో బాబు ఏర్పాటు చేశారని, ఆ సంస్థతో ఆనాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. అసలు ఐఎంజీ కంపెనీతో భారత్ సంస్థకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఐఎంజీ భారత్ అనే బోగస్ కంపెనీకి 850 ఎకరాల భూమిని కేటాయించారని, హైదరాబాద్ లోని స్టేడియంలో అవసరమైనవి తీసుకునే హక్కును కల్పించారన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ వెళ్లేదారిలో 5 వేల గజాల స్థలాన్ని కూడా ఇస్తున్నట్లు ఆనాడు బాబు కుదుర్చుకున్న ఎంవోయూలో ఉందన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు అనుకుని ఉంటే బాబు అప్పుడే జైలుపాలయ్యేవాడని, వైఎస్ మంచితనం వల్లే బతికిపోయాడని సజ్జల అన్నారు. అమరావతిలో కూడా స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా పేరుతో ఊరూపేరూ లేని సంస్థను తీసుకొచ్చి 1700 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టారన్నారు. ఈమధ్యనే చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ స్కాం కేసు కూడా ఇలాంటిదేనని, అందుకే అటువంటి బాబుకు అధికారం కట్టబెట్టొద్దని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.