తిరుమలలో మరోసారి చిరుత కలకలం
X
తిరుమల కాలినడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు వణికిపోతున్నారు. భక్తులను చిరుత పులుల భయం వెంటాడుతోంది. రెండు రోజుల క్రితం నడకదారిలో వెళ్తున్న బాలికను చిరుత చంపేయడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా మరోసారి చిరుత కలకలం రేగింది. ఉదయం నడకదారికి దగ్గర్లో చిరుత పులి సంచరించినట్లు భక్తులు చెబుతున్నారు. కొందరు భక్తులు గుంపుగా వెళ్తున్నప్పటికీ.. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి దగ్గర్లో.. నామాలగని దగ్గర.. చెట్ల మాటున ఏదో జంతువు కనిపించింది. దానిని చిరుతపులిగా భావించిన భక్తులు భయంతో కేకలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే భక్తుల అరుపులకు చిరుత అక్కడి నుంచి పారిపోయిందని చెబుతున్నారు. అధికారలుకు విషయం తెలియడంతో అలర్ట్ అయ్యారు. అది చిరుతపులి కాదనీ.. జింక పిల్ల అని అధికారులు చెబుతున్నారు.
కాలినడక మార్గాల్లో మొత్తం ఐదు చిరుత పులులు సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిన్న కాలినడక మార్గాల్లో ఐదు ప్రదేశాల్లో 5 చిరుతపులుల పాద ముద్రలు కనిపించాయి
తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. చిరుతల ఆచూకీ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదయ్యాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో మొత్తం 25 నుంచి 30 చిరుతలు ఉన్నట్లు డీఎఫ్ఓ శ్రీనివాసులు వెల్లడించారు. ఉదయం పట్టుబడిన చిరుత..బాలిక పై దాడి చేసిన చిరుత.. పట్టుబడ్డ చిరుత ఒక్కటేనా అన్నదానిపై పరీక్షలు జరిపి నిర్ధారిస్తామన్నారు.
కొత్త రూల్స్...
తిరుమల నడకదారిలో బాలికను చిరుత చంపిన ఘటనతో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. నడకదారి మార్గంలో కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఇకపై అలిపిరి నడకమార్గంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించారు. అదే విధంగా సాయంత్రం తర్వాత కూడా నడకమార్గంలో వెళ్లేవారిపై ఆంక్షలు విధించింది. ఏడో మైలు నుంచి శ్రీ నృసింహాలయం వరకూ హై అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. హై అలర్ట్ ప్రకటించిన మార్గంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి 100 మంది భక్తులు గుంపులుగానే వెళ్లాల్సి ఉంటుంది. వారికి రక్షణగా పోలీసులు ఉంటారు. ఇక ఏడో మైలు వద్ద 15 ఏళ్ల లోపు పిల్లల చేతికి ధరించేందుకు ట్యాగ్స్ ఇస్తారు. ఈ ట్యాగ్స్‌పై చిన్నారుల తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్లు వంటివి ఉంటాయి. ఇవి చేతికి ఉండటం వల్ల చిన్నారులు తప్పిపోతే వారిని వెంటనే గుర్తించే అవకాశం ఉంది.