Home > ఆంధ్రప్రదేశ్ > అలిపిరి బ్లాస్ట్ వేళ సివంగిలా రెచ్చిపోయిన సీఐ అంజూ యాదవ్

అలిపిరి బ్లాస్ట్ వేళ సివంగిలా రెచ్చిపోయిన సీఐ అంజూ యాదవ్

అలిపిరి బ్లాస్ట్ వేళ సివంగిలా రెచ్చిపోయిన సీఐ అంజూ యాదవ్
X

శ్రీ కాళహస్తి సీఐ అంజూ యాదవ్ గురించి గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు పత్రికల్లోనూ కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ జనసేన కార్యకర్త పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించిందని, చేయి చేసుకుందని.. గతేడాది కూడా ఓ మహిళ పట్ల అభ్యంతర కరంగా వ్యవహరించిందని టీవీ ఛానెళ్లు సహా పలు వైబ్ సైట్లు కోడైకూస్తున్నాయి. ఇంత నెగెటివ్ ప్రచారాల మధ్య ఆమె గురించి ఓ ఆసక్తి కర కథనం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2003లో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్‌పై నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అంజూ యాదవ్. ఆ కాన్వాయ్‌కు ముందు కారులో ఆమె ఉన్నారు. చంద్రబాబు వాహనం బ్లాస్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే.. అంజూ యాదవ్ వెంటనే వచ్చి కారుపైకి ఎక్కారు. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని మిగిలిన వారితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సూపర్ పోలీసుగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆమె చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా విధుల్లో నిర్వర్తిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం అంజూ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. "ఆరోజు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి.. స్విమ్స్ ప్రోగ్రామ్ సాయంత్రం 4 గంటలకు అయిపోయింది.. అక్కడి నుంచి తిరుమల కొండకు వెళ్లాల్సి ఉంది. సాయంత్రం 4.05 నిమిషాలకు కాన్వాయ్ బయలుదేరింది. లీడ్ కారులో కొందరు అధికారులు కూడ ఉన్నారు. ఆనాడు గరుడ దగ్గర వెహికల్ పాస్ అయిందో? లేదో? చూడమని చెప్పడంతో వెనక్కి తిరిగి చూసే సరికి.. ఒక్కసారి బ్లాస్ అయిన దృశ్యం కనిపించింది" అని అంజూ యాదవ్ పేర్కొన్నారు.

ఆ తర్వాత వెంటనే అధికారులు అందరూ పొజిషన్ తీసుకున్నారని చెప్పారు. తాను ఆ సమయంలో తన వద్ద వెపన్ ఉన్నప్పటికీ ఫైర్ ఓపెన్ చేయలేదని తెలిపారు. అయితే అప్పుడు తనతో పాటు కారులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వారించినప్పటికీ తాను వినలేదని.. వెంటనే పరిగెత్తి అక్కడికి చేరుకున్నానని తెలిపారు. అక్కడికి వెళ్లి కారు ఎక్కి చూశానని తెలిపారు. మిగిలినవారు కూడా అక్కడికి వచ్చి.. కారులో నుంచి అందరిని బయటకు తీసి అంబులెన్స్ తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. ఆ ఘటనను ఇప్పుడు తలచుకుంటే భయమేస్తుందని.. అప్పుడు చాలా చాలెజింగ్ అనిపించిందని అన్నారు.

అయితే ఇప్పుడు మాత్రం.. అంజూ యాదవ్ కాంట్రావర్సీలకు కేరాఫ్ గా మారారు. ఏపీలో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. వైసీపీ పెద్దల అండదండలు ఉన్నాయని.. అందుకే ఆమెపై సరైన చర్యలు ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated : 18 July 2023 12:42 PM IST
Tags:    
Next Story
Share it
Top