CID NOTICE: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
X
ఏపీ మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 4న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో నారాయణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ సమయంలోనే సీఐడీ నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ ద్వారా నారాయణకు సీఐడీ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే నారా లోకేష్‌కు ఢిల్లీలో సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక లోకేశ్ ను విచారణకు పిలిచిన సమయంలోనే ఇప్పుడు సీఐడీ నారాయణకు నోటీసులు ఇచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఏ2గా ఉన్న నారాయణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటుగా లోకేశ్ పేర్లను చేర్చింది. ఇదే కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సూచనలతో సీఐడీ తాజాగా లోకేశ్ కు నోటీసులు అందించింది. ఈ నెల 4న విచారణకు రావాలని పేర్కొంది.
నోటీసులపై నారాయణ స్పందిస్తూ.. ‘‘సీఐడీ నోటీసుల ప్రకారం ఈనెల 4న విచారణకు హాజరవుతాను. వివరాలన్నీ అధికారులకు వెల్లడిస్తాను. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో అంతకుమించి దీనిపై స్పందించను’’ అని తెలిపారు.