ముగిసిన రిమాండ్, కస్టడీ.. వర్చువల్గా ఏసీబీ జడ్జి ముందుకు చంద్రబాబు
X
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ చీఫ్ చంద్రబాబు రెండ్రోజుల కస్టడీ ముగిసింది. దీంతో సీఐడీ అధికారులు ఆయనను వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ తోపాటు సీఐడీ కస్టడీ పొడగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కస్టడీ గడువు ముగిసినందున జైలు నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తి సీబీఐ అధికారులను ఆదేశించారు. కాసేపట్లో జడ్జి చంద్రబాబుతో వర్చువల్ మాట్లాడనున్నారు. అనంతరం రిమాండ్, కస్టడీ పొడగింపునకు సంబంధించి న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.
ముగిసిన చంద్రబాబు రెండు రోజుల పోలీస్ కస్టడీ
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని కోర్టు ఉత్తర్వుల మేరకు రెండ్రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించారు. రెండోరోజు సైతం దాదాపు 6గంటలకుపైగా ప్రశ్నించారు. శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది.గంటకు ఐదు నిమిషాల చొప్పున బ్రేక్ ఇచ్చిన అధికారులు విచారణ ప్రక్రియ అంతటిని వీడియో తీయించారు. రెండు రోజుల కస్టడీలో సీఐడీ 100కు పైగా ప్రశ్నలు అడగగా.. చంద్రబాబు వాటిలో కొన్నింటికి సమాధానం చెప్పలేదని సమాచారం. విచారణ పూర్తైన అనంతరం డాక్టర్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.