Home > ఆంధ్రప్రదేశ్ > రాజమండ్రికి సీఐడీ టీమ్..చంద్రబాబుకు వైద్య పరీక్షలు

రాజమండ్రికి సీఐడీ టీమ్..చంద్రబాబుకు వైద్య పరీక్షలు

రాజమండ్రికి సీఐడీ టీమ్..చంద్రబాబుకు వైద్య పరీక్షలు
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. 2రోజుల పాటు సీఐడీ కస్టడీకి అంగీకారం తెలుపుతూ శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరింది. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగగా.. సీఐడీ లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం 2రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఇవాళ చంద్రబాబును సీఐడీ కస్టడీలోకి తీసుకోనుంది. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఇవాళ, రేపు చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రపై విచారించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును అధికారులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కోర్టు పలు నిబంధనలు జారీ చేసింది.

సీఐడీ విచారణకు ఏసీబీ కోర్టు అనుమతిస్తూనే చంద్రబాబు వయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐడీకి సూచించింది. ఈ క్రమంలో చంద్రబాబును కస్టడీలోకి తీసుకునే ముందు మెడికల్ టెస్టులు చేయనున్నారు. ఆ తర్వాతే బాబును సీఐడీ కస్టడీలోకి తీసుకోనుంది. విచారణ సమయంలో పలు నిబంధనలను కోర్టు విధించింది . " ప్రతి గంటకి 10 నిమిషాల చొప్పున బాబుకు విశ్రాంతి ఇవ్వాలి. సీఐడీ అధికారులు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలి. స్కిల్ కేసులో చంద్రబాబును విచారించే 22 మంది అధికారుల పేర్లను కూడా ముందుగా కోర్టుకు అందించాలి. ఈ విచారణ మొత్తాన్ని వీడియో తీయాలి. ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్తవహించాలి. మీడియాకు విచారణకు సంబంధించిన విషయాలను తెలపకూడదు" అని ఎసీబీ కోర్టు జడ్జి శుక్రవారం ఇచ్చిన తీర్పులో తెలిపారు. ఇక ఇప్పటికే బాబును విచారించేందుకు సీఐడీ అధికారులు రాజమండ్రి చేరుకున్నారు. మరికాసేపట్లో సీఐడీ విచారణ రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రారంభం కానుంది. ఈ విచారణలో కీలక ఫైల్స్‌ను చంద్రబాబు ముందు ఉంచి అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.




Updated : 23 Sept 2023 9:04 AM IST
Tags:    
Next Story
Share it
Top