AP Electricity Charges : ఏపీలో కరెంటు చార్జీల పెంపుపై క్లారిటీ
X
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీఈఆర్సీ రెండో ఏడాది కూడా శుభవార్త చెప్పింది. గత ఏడాది విద్యుత్ చార్జీలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి పెంచలేదు. దీంతో ఈ ఏడాది పెంచుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఏడాది కూడా చార్జీలు పెంచబోమని ఏపీఈఆర్సీ తెలిపింది. 2024-25 ఏడాదిలో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ భారం పడకుండా చూస్తున్నట్లు చెప్పింది. విద్యుత్ రంగానికి సంబంధించి రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై భారం పడదని తెలిపింది.
విద్యుత్ భారం పడకుండా పాత టారిఫ్‌లనే కొనసాగిస్తున్నట్లుగా మూడు డిస్కమ్‌లు క్లారిటీ ఇచ్చాయి. ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ చర్యలు తీసుకుంటోందన్నారు. డిస్కమ్ వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
ప్రస్తుతం విద్యుత్‌శాఖకు రూ.17,854 కోట్ల ఆదాయం వస్తోందని, ఇక 2024-25లో మొత్తం రూ.21,161 కోట్ల ఆదాయం వస్తుందని సీవీ నాగార్జునరెడ్డి అంచనా వేశారు. ప్రస్తుతం ఆదాయం, వ్యయాలు సమానంగా ఉన్నాయన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలు ఉంటే ఏపీఈపీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.