వారికి గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల చేసిన సర్కార్
X
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ అయిన వైసీపీ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ తరుణంలో వైసీపీ నవరత్నాల పథకాల గురించి, వాటి వల్ల ప్రజలు పొందిన లబ్ధి గురించి తెలియజేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇంకా జమ కాని నిధులను విడుదల చేస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఐదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
సీఎం జగన్ బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను జమ చేశారు. ఈ పథకాలకు అర్హులైన 10,132 జంటలకు రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. వధువుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఐదో విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. పేదవాళ్లు తమ పిల్లల వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు.
ప్రతి గడపకూ వైసీపీ పథకాలు వెళ్తున్నాయన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీయేనని అన్నారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని, పేదలకు ఎటువంటి న్యాయం జరగలేదని, వైసీపీ సర్కార్ ప్రతి ఒక్కరినీ ఆదుకుందన్నారు. ప్రజల దీవెనలతో ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు కానుందని, ఫ్యాన్ ఎప్పుడూ ఇంటిలోనే ఉండాలని అన్నారు. సైకిల్ ఇంటి బయట, టీ గ్లాసు సింక్ లోనే ఉండాలన్నారు. ప్రజల ఆశీస్సులతో ఈసారి కూడా విజయం దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని సీఎం జగన్ అన్నారు.