చంద్రబాబు ఎన్నికల వరకు జైల్లోనే.. జగన్ వ్యూహం అదే!
X
తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికల సందడి మొదలైంది! అభ్యర్థుల జాబితా ప్రకటన, ప్రచారం లేకపోయినా జైలు రాజకీయాలతో ఓట్ల పండగకు సన్నాహాలు రసవత్తంగా ప్రారంభమయ్యాయి. అధికారంలోకి వచ్చాక దాదాపు నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబును కేవలం మాటలతో, కేసులతో మాత్రమే ఇబ్బందిపెట్టిన జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చి జైల్లోకి నెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతోపాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును కూడా దుమ్ముదులిపారు. మరికొన్ని చిన్నాచితకా కేసులను కూడా తెరపైకి తీసుకురానున్నారు. ‘‘మాపై మరిన్ని కేసులు పెడతారు. ఎవరికీ భయపడం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం’’ అని బాబు బావమరిది బాలయ్య మంగళవారం అన్నారు. జగన్ విసిరే సవాలును దీటుగా ఎదుర్కొంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. సరిగ్గా జగన్ కోరుకుంటున్నదీ అదేనని స్పష్టంగా అర్థమవుతోంది. కేసులతో టీడీపీ పీకల్లోతు కూరుకుపోయి ఎన్నికల్లో చతికిలబడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం!
తండ్రీకొడుకులను..
చంద్రబాబు శనివారం అరెస్టయ్యాక అటు విజయవాడలోని ఏసీబీ కోర్టు, ఇటు హైకోర్టుల చుట్టూ ఆయన న్యాయవాదులు, టీడీపీ నేతలు చక్కర్లు కొట్టారు. బాబు తనయుడు లోకేశ్ తన ‘యువగళం’ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. బాలయ్య మంగళగిరిలో ప్రెస్‌మీట్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగుతున్నారు. అసెంబ్లీ, పార్లెమెంటు ఎన్నికలకు గట్టిగా ఏడు నెలల వ్యవధే ఉన్న నేపథ్యంలో విపక్షాన్ని లిటిగేషన్ కేసుల్లో ఇరికించి ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది జగన్ వ్యూహం. బాబుపైనే కాకుండా, లోకేశ్‌పైనా మరికొన్ని కేసులు పెడతారని, లోకేశ్ యాత్రను అడ్డుకోవడానికి కేసుల పేరుతో అరెస్ట్ చేస్తారని ఇప్పటికే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పార్టీ సారథులైన తండ్రీకొడుకులు జైలుపక్షులై పార్టీని నడిపించే దిక్కులేకుండా పోతుంది. కీలకమైన ఎన్నికల కాలంలో అటు వ్యూహాలు రచించేవారు లేక, ఇటు ప్రచారం చేసే వారు లేక ద్వితీయ శ్రేణి నాయకులతో సరిపెట్టాల్సి వస్తుంది. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి నేతలను కూడా పాత కొత్త కేసుల్లో ఇరికిస్తే అదీ సాధ్యం కాకపోవచ్చు. చట్టంతో దాని పనిని చేయిస్తూ విపక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి అధికార పక్షం ఏ అవకాశాన్నీ జారవిడుచుకోదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.
మరెన్నో...
నిజానికి బాబును ఇరికించాలంటే ఏలేరు స్కామ్ వంటి పెద్దపెద్ద కేసులే ఉన్నాయి. వాటిని తిరగదోడే బదులు చిన్న కేసులే మేలని వైసీ భావిస్తోంది. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, అమరావతి అసైన్డ్ భూములు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి మరెన్నో కేసుల్లో బాబు ప్రమేయానికి పక్కా ఆధారాలు సేకరించి ఒకదాని తర్వాత ఒక కేసులో అరెస్టులు, రిమాండ్లతో ఊపిరాడనివ్వకుండా చేస్తే విపక్షాన్ని పూర్తి దెబ్బతీయొచ్చు. మరి, ఇన్నాళ్లూ ఈ అవకాశమున్నా జగన్ వాటి జోలికి ఎందుకు పోలేదనే అనుమానం రావొచ్చు. ప్రజాసంక్షేమ పథకాలను తనను మళ్లీ గెలిపిస్తాయని, విపక్షానికి ప్రజల్లో ఆదరణ లేదని నిర్ధారించుకునేవరకు ఆయన వేచి చూసి, ఇప్పుడు అదను చూసి దెబ్బకొట్టినట్లు కనిపిస్తోంది. పలు సర్వేలు మళ్లీ గెలుపు వైపీసీదేనని చెబుతుండడం, లోకేశ్ పాదయాత్రకు స్పందన లేకపోవడం వంటి పరిణామాలతో జగన్ టీడీపీపై గొడ్డలి వేటు వేసేందుకు సాహసించారు. ‘ఇప్పుడు కాకపోతే మరెప్పూడూ సాధ్యం’ అని ఉచ్చు బిగించారు.
ఆ మాట ఎత్తకుండా.. మోదీ అండ...
జగన్ లక్షకోట్ల అవినీతి, అక్రమాస్తులంటూ టీడీపీ నేతలు పదేపదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టి బదులు తీర్చుకోవడానికి జగన్ బాబును జైలు పంపినట్లు కనిపిస్తోంది. ఒకపక్క తను స్వయంగా అవినీతి కేసులు ఎదుర్కొంటూ, కోర్టులు చుట్టూ తిరుగుతున్న జగన్.. బాబు అవినీతిపై చేసే విమర్శలకు బలం ఉండాలనంటే ఆయనను కూడా జైల్లో పెట్టక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది. మరోపక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తనకున్న సన్నిహిత సంబంధాల వల్ల కూడా ఆయన దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమతో తెగతెంపులు చేసుకున్న బాబును చేరదీసే స్థితిలో బీజేపీ లేదు. రాష్ట్రంలో ఎన్ని గొడవలు ఉన్నా అటు జగన్, ఇటు బాబు తమ గుప్పిట్లో ఉంటారని, ఉంచుకోవాలని దాని వ్యూహం. ప్రస్తుత ఏపీలో జరుగుతున్న పరిణామాలు దానికి ప్రతిబింబమే. ఇదంతా ఒక ఎత్తయితే చంద్రబాబుకు పొలికల్ మైలేజీ ఇవ్వడానికే బీజేపీ పావులు కదిపి అరెస్ట్ చేయించిదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నర గుసగుసలు పైకి చెప్పుకోని హైలైట్..!!!