Home > ఆంధ్రప్రదేశ్ > అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
X

విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. విజయవాడ స్వరాజ్య మైదాన్ లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. తన జీవితాన్ని పేదల కోసం త్యాగం చేసి, వారి అభ్యున్నతికి అనుక్షణం పరితపించిన మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ప్రతిరోజు స్మరించుకోవాలని సూచించారు. అందరూ ఆయన విధానాలను పాటించాలన్నారు.

అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్‌ అని సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి సమ సమాజ నిర్మాణంలో మన వంతు పాత్రను పోషించడమే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి అని అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటి కంటే పెద్దది అని వెల్లడించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందని పేర్కొన్నారు. ఈ మహా విగ్రహం అందరికీ స్ఫూర్తిదాయకం అని, కానీ పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. అంబేద్కర్ భావజాలం పెత్తందార్లకు నచ్చదని అన్నారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.



Updated : 19 Jan 2024 4:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top