Chinta Mohan : రాజకీయాల్లోకి చిరంజీవి.. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్
X
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతల వలసలతో పార్టీల్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రావడంతో ఆ పార్టీకి కొంత ఊపొచ్చింది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవే అని అన్నారు. తిరుపతి నుంచి పోటీ చేయాలని మెగాస్టార్ను కోరతామన్నారు. సీఎం అభ్యర్థిగా చిరు తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయమని చెప్పారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలని.. గెలిపించుకునే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో 130 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవి కోరుకుంటున్న కాపులకు ఇదే సరైన సమయం అన్నారు. ఈ అంశంపై స్వయంగా వెళ్లి చిరంజీవితో మాట్లాడతానని చెప్పారు. కర్నాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఏపీలో కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం పెరిగిందన్నారు. ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. కాగా చిరంజీవి రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. 2015 నుంచి ఆయన పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అనేది ఆసక్తిగా మారింది.