Kadapa: భార్య, కూతుళ్లను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య
X
ఏపీలోని కడప నగరంలో దారుణం జరిగింది. స్థానిక కోఆపరేటివ్ కాలనీలో నివాసముంటున్న ఓ కానిస్టేబుల్ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడా కానిస్టేబుల్. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కడప పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే వెంకటేశ్వర్లు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు(50)... బుధవారంనాడు రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని ఆయన ఇంటికి చేరుకున్నాడు. అయితే గంట తర్వాత రాత్రి 12 గంటలకు తిరిగి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. స్టేషన్ నుండి తుపాకీని తన వెంట తెచ్చుకున్నాడు. ఇంటికొచ్చాక భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు. ఒకరు డిగ్రీ చదువుతున్నారు. మరొకరు ఇంటర్ చదువుతున్నట్టుగా స్థానికులు చెప్పారు. భార్య, పిల్లలను హత్య చేసిన తర్వాత వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసినట్లు తెలిసింది. ఆ నోట్లో తన ఆస్తి, ఉద్యోగం కూడా రెండో భార్యకు, ఆమె కొడుకుకి చెందాలని పేర్కొన్నాడు.
కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్ ఇలా చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.