Home > ఆంధ్రప్రదేశ్ > దుర్గమ్మ గుడిలో దోపిడీ..టెంకాయ 25, కొట్టడానికి 20

దుర్గమ్మ గుడిలో దోపిడీ..టెంకాయ 25, కొట్టడానికి 20

దుర్గమ్మ గుడిలో దోపిడీ..టెంకాయ 25, కొట్టడానికి 20
X

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి వివాదాలు కొత్తేమి కాదే . నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా కనక దుర్గమ్మ గుడిలో మరో కొత్త దందా బయటపడింది. భక్తులకు కాంట్రాక్టర్లు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. భక్తితో భక్తులు తెచ్చే కొబ్బరికాయలను కొట్టడానికి కాంట్రాక్ట్ సిబ్బంది వారిని నిలువు దోపిడీ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. గుడిలో గొబ్బరికాయ కొట్టాలంటే రూ.20 చెల్లించాల్సిందేనని కాంట్రాక్టర్ తెగేసి చెబుతున్న ఈ వీడియో పెద్ద దుమారం రేపుతోంది. ఆలయంలో అవినీతిని ప్రక్షాళన చేస్తామని చైర్మన్ ప్రకటనలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని, ఆచరణలో కనిపించడం లేదని ఈ వీడియో మరోసారి రుజువు చేసింది. కాంట్రాక్టర్‌.. వారానికి లక్ష రూపాయలు టెండర్ పాడుకుని ఆ డబ్బులను భక్తుల వద్ద నుండి దండుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.


కొండ పైన ఒక్కో కొబ్బరికాయ ధర రూ.25. నుంచి రూ.30 వరకు ఉంది. కానీ అదే టెంకాయను కొట్టడానికి భక్తుల నుంచి 20 రూపాయలు వసూలు చేస్తున్నాడు కాంట్రాక్టర్. టెంకాయ కొట్టేందుకు డబ్బులు వసూలు చేయడమేంటని ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిజానికి కొన్ని కొన్ని దేవస్థానాల్లో భక్తులే స్వయంగా టెంకాయలు కొడతారు. మరికొన్నిచోట్ల చిల్లర అడుగుతారు కానీ ఇలా 20 రూపాయలు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.


ఇదిలా ఉంటే గతంలో హుండీల లెక్కింపు సమయంలో చోరీకి పాల్పడిన కె. పుల్లయ్య అనే వ్యక్తి అల్లుడికి ప్రస్తుత కాంట్రాక్టర్‌ బినామీగా ఉన్నడన్న ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగంగా భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నా దుర్గగుడి అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. అయితే, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఓ ఓ భక్తుడు తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. మరో సారి దుర్గమ్మ గుడి వార్తల్లో నిలిచింది.

Updated : 28 Jun 2023 1:25 PM IST
Tags:    
Next Story
Share it
Top