వివాదంలో సాయి ధరమ్ తేజ్.. ఇదేం పని అంటున్న పండితులు
X
యాక్సిడెంట్ తర్వాత ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన తాజాగా బ్రో మూవీతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో సాయి ధరమ్ తేజ్ చేసిన పనిపై తీవ్ర దుమారం రేగింది.
సాయిధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. ఇందులో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఆలయంలో సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రత్యేక పూజ వివాదస్పదంగా మారింది.
శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. అక్కడ సుబ్రమణ్యస్వామి పూజ అనంతరం తానే స్వయంగా హారతి ఇచ్చారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని పండితులు అంటున్నారు. భక్తులు నేరుగా దేవుడికి హారతులివ్వడం విరుద్ధమని మండిపడుతున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇవ్వడంపై భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో అయినంత మాత్రాన ఏం చేసినా కుదురుతుందా అని నిలదీస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై సాయి ధరమ్ తేజ్ ఇంకా స్పందించలేదు.