Home > ఆంధ్రప్రదేశ్ > ఆదాయం పెరుగుతోంది.. దేశంలో పేదరికం తగ్గుతోంది : Modi

ఆదాయం పెరుగుతోంది.. దేశంలో పేదరికం తగ్గుతోంది : Modi

ఆదాయం పెరుగుతోంది.. దేశంలో పేదరికం తగ్గుతోంది : Modi
X

భారత వాణిజ్య విధానానికి అంతర్జాతీయంగా మంచి పేరుందని ప్రధాని మోదీ అన్నారు. పన్ను విధానంలో దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఏపీలో నూతనంగా నిర్మించిన నాసిన్ సెంటర్ను మోదీ ప్రారంభించారు. ఈజ్ ఆఫ్ డూయిండ్‌కి నాసిన్‌ లాంటి సంస్థలతో ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చామని.. దీంతో దాదాపు రూ.2.5 లక్షల కోట్ల పన్ను ఆదా అయినట్లు తెలిపారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే ప్రతీ పైసా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామన్న ప్రధాని.. సుపరిపాలన అంటే ఇదేనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశమంతా ఇప్పుడు రామమయం అయిపోయిందని మోదీ అన్నారు. రాముడి మార్గంలో నడిస్తే దేశం భవిష్యత్తు బాగుటుందన్నారు. గాంధీ కూడా రామరాజ్యం గురించి మాట్లాడేవారని.. రామరాజ్యం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. సుపరిపాలనకు నాసిన్ సరికొత్త కేంద్రంగా మారనుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బలహీనులకు అండగా నిలబడడమే సుపరిపాలన అని చెప్పారు. గత పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతుందన్న ప్రధాని.. ఎన్నో కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.

కాగా బనాసిన్‌ను 503 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్ అధికారులకు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడం ఈ సెంటర్ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాల ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మిత్రదేశాల అధికారులకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. వర్చువల్ సమావేశాలతోపాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లర్నింగ్ వంటి అత్యాధునిక బోధనా వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. కస్టమ్స్, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, డ్రగ్స్ నిరోధక చట్టాలు, మనీల్యాండరింగ్ నిరోధక చట్టాలు, దొంగనోట్లను అరికట్టే విధానాలపై శిక్షణ ఇస్తారు.

నాసిన్‌లో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మిస్తున్నారు. వందల మంది ఉద్యోగులకు, ఇతర సిబ్బందికి క్వార్టర్లు ఏర్పాటు చేశారు. పోస్టాఫీస్, బ్యాంకు, సూపర్ మార్కెట్ వంటి మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైల్వేలైన్‌, ఈఎస్ఐ ఆస్పత్రి కూడా రాబోతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం 3 లక్షల మొక్కలు నాటుతారు. నాసిన్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. నాసిన్ ఏర్పాటుతో పాలసముద్రం గ్రామం కూడా అభివృద్ధి చెందనుంది. కరువు పీడిత ప్రాంతంలో జాతీయ సంస్థ రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. వెనక బడిన రాయలసీమకు ఇలాంటి మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాలని స్థానిక ప్రజలు, నాయకులు కోరుతున్నారు.

Updated : 16 Jan 2024 6:33 PM IST
Tags:    
Next Story
Share it
Top