Secretary Ramakrishna : వాళ్లకిచ్చిన హామీ అమలు చేసుంటే రోడ్డెక్కేవారా?.. సీఎంపై రామకృష్ణ ఫైర్
X
అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పోయిన ఎన్నికల్లో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా 1.06 లక్షల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండగకు వైకాపా ప్రభుత్వం దూరం చేసిందన్నారు. ఇచ్చిన మాట అమలు చేసుంటే వారు రోడ్డుపైకి వచ్చేవారా?అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపడం లేదని నిలదీశారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా? అని మండిపడ్డారు. ఏది ఏమైనా.. పండగ పూట జగన్ పండగ చేసుకుంటూ అంగన్‌వాడీలను జగన్ వీధులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగులుతుందన్నారు.
అంతకుముందు కూడా అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రామకృష్ణ. మాట తప్పని నాయకుడు మీరు.. ఎస్మా ఎలా ప్రయోగిస్తారు..? అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. వారి ఉద్యోగం కాదు.. మూడు నెలల్లో సీఎం జగన్ ఉద్యోగం ఊడిపోతుందని జోస్యం చెప్పారు. అంగన్వాడీల సమస్యల పరిష్కరించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాం అని హెచ్చరించారు రామకృష్ణ. రాష్ట్రంలో 460 మండలాలు కరవుతో అల్లాడుతున్నాయి. గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రమంతా హాయిగా ఉన్నట్టు ప్రకటనలు ఇస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.. అయినా పార్టీ వ్యవహారాల్లో మునిగి ప్రభుత్వాన్ని పట్టించుకునే పరిస్థితి లేదంటూ ఫైర్ అయ్యారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.