జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్తో భేటీ..!
X
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకుంటారనే చర్చ నడుస్తోంది. ఇటీవలే వైసీపీకి రాయుడు రాజీనామా చేశారు. ఆ పార్టీలో చేరి 10 రోజులు కూడా కాకముందే రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న రాయుడు.. జనవరి 6న ఆ పార్టీని వీడుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆ తర్వాత పార్టీని ఎందుకు వీడారో క్లారిటీ ఇచ్చారు.
‘‘నేను జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ t20లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని రాయుడు ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన జనసేన అధినేతతో భేటీ కావడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని రాయుడు భావిస్తున్నారు. వైసీపీలో టికెట్ కష్టమని తెలియడంతోనే ఆ పార్టీని వీడినట్లు ఆరోపణలు ఉన్నాయి.