తిరుమలకు పోటెత్తిన భక్తులు.. వీఐపీల రాకతో తలలు పట్టుకుంటున్న అధికారులు
X
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు, వీఐపీలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోగా.. శ్రీవారి దర్శనానికి 16గంటల సమయం పడుతోంది. అంచనాలకు మంచి భక్తులు తరలివస్తుండటంతో టోకెన్లు లేని వారిని క్యూ లైన్లలోకి అధికారులు అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నవారికి ఈ అర్దరాత్రి దర్శనం అయ్యే అవకాశం ఉంది. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపాలని అధికారులు నిర్ణయించారు.
మరోవైపు పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రముఖులకు వసతి కల్పించటం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. రేపు వైకుంఠ ద్వారా దర్శనం కోసం దేశవ్యాప్తంగా ప్రముఖులు తిరుమలకు వస్తున్నారు. ఐదుగురు సుప్రీం న్యాయమూర్తులతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు తిరుమల వస్తున్నట్లు సమాచారం. పలువురు మంత్రులు, స్పీకర్ తిరుమలకు చేరుకోనున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమలకు వస్తుండటంతో వారికి వసతి కల్పించడంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.