తిరుపతిలో దారుణం.. ఆలయంలోకి దళితులు ప్రవేశించకూడదట
X
ఈ ఆధునిక కాలంలోనూ దళితులు కొన్ని చోట్ల వివక్షకు గురవుతున్నారు. సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. కులం అనే పేరుతో వారి పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అంటరానితం వంటి దురాచారాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. తాము కూడా అందరిలాంటి మనుషులమేనని, దేవుడిని దర్శించుకొని కోరిక తమకి ఉంటుందని వారు మొర పెట్టుకున్నా కొందరు మాత్రం రాతియుగంలో ఉండిపోయారు. తాజాగా, తిరుపతి జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో దళితులు ఆలయంలోకి రాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు.
గ్రామంలోని పోలాక్షమ్మ ఆలయం(Polakshamma Temple)లోకి దళితులు రాకుండా అగ్రవర్ణాలకు చెందిన కొందరు అడ్డుకున్నారు. దళితులకు ఆలయం లోపలికి ప్రవేశం లేదంటూ అగ్రవర్ణానికి చెందిన కొందరు అభ్యంతరం చెప్పారు. అంతటితో ఆగకుండా ఆలయానికి తాళం వేశారు. అగ్రవర్ణాల కుల దురహంకారానికి ఎదురు చెప్పలేక దళితులు ఆలయం బయటే మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఇదే విషయాన్నిమూడు నెలల క్రితం కలెక్టర్, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే ఆలయం లోపలికి ప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆలయ ప్రవేశం చేయించే వరకు న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు దళితులు.
దళిత హక్కుల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. పోలాక్షమ్మ ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించాలని మూడు నెలల నుంచి తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్‌ను పంపి ప్రవేశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, గ్రామస్థులు మాత్రం ఆలయంలోకి ప్రవేశించకుండా తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. అనంతరం ఆలయం బయటే అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.