పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు డేట్ ఫిక్స్..
X
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహుర్తం ఖరారైంది.వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈనెల 14 నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించునున్నారు. పవన్ ప్రచార రథం వారాహితో ఇదే మొదటి యాత్ర.జనసేన పార్టీ శ్రేణులతో విస్తృత చర్చలు అనంతరం పవన్ కల్యాణ్ పర్యటన రూట్ మ్యాప్ వివరాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 14 నుంచి పవన్ వారాహి వాహనం రోడ్డెక్కుతుందని చెప్పారు. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. అన్నవరం నుంచి భీమవరం వరకు తన యాత్ర కొనసాగిస్తారన్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో పవన్ సమావేశమవ్వనున్నట్లు నాదేండ మనోహర్ స్పష్టం చేశారు. జనసేన ద్వారా ప్రజలకు భరోసా కల్పించేలా యాత్ర ఉంటుందని వివరించారు. జనసేన యాత్రతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.