భరతనాట్యం చేస్తూ తిరుమల కొండకు.. అదికూడా 75 నిమిషాల్లోనే..!
X
తిరుమల శ్రీవారిపై భక్తులకు నమ్మకం ఎరక్కువ. ఆయనను దర్శించడానికి నిత్యం వేలాది మంది భక్తులు కొండకు వస్తుంటారు. తల నీలాలు సమర్పించడం, ముడుపులు అప్పగించడమే కాకుండా.. తమ కోరికలు తీర్చాలని కాలి నడకన కూడా తిరుమల కొండపైకి వస్తుంటారు. అయితే, ఓ భక్తుడు మాత్రం వినూత్నంగా తన మొక్కును తీర్చుకున్నాడు. కాలి నడకన కాకుండా.. భరత నాట్యం చేస్తూ తిరుమల కొండ ఎక్కాడు. అది కూడా కేవలం 75 నిమిషాల్లోనే. దీంతో అతన్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సారావుపేటకు చెందిన డాక్టర్ కృష్ణ వాసు.. భరత నాట్యం కళాకారుడు. పల్నాడు శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో సంసృత టీచర్ గా పనిచేస్తున్నాడు. తన కోరిక తీరితే శ్రీవారి కొండకు భరతనాట్యం చేస్తూ వస్తానని మొక్కుకున్నాడు. అందులో భాగంగానే.. జులై 12న తిరుపతి చేరుకుని.. శ్రీవారి మెట్టు మార్గం నుంచి నాట్యం చేస్తూ తిరుమల కొండకు చేరుకున్నాడు. అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలు పాడుతూ, వాటికి తగ్గట్లు నాట్యం చేస్తూ కేవలం 75 నిమిషాల్లోనే మెట్లు ఎక్కాడు. మామూలుగా అయితే ఈ కొండ ఎక్కడానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నేటి యవతలో సంస్కృతి సంప్రదాయాలు, కళలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.