ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగి.. వైద్య కోసం వచ్చిన రోగి ఏం చేసిందంటే...
X
గుంటూరు ప్రభుత్వాస్పత్రి తరచూ వార్తల్లో నిలుస్తోంది. వారం క్రితమే ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సిబ్బందిపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఓ నకిలీ ఉద్యోగి బాగోతం బయటపడడంతో మరోసారి గుంటూరు జీజీహెచ్ టాక్ ఆఫ్ ది సిటీ గా మారింది.
చికిత్స నిమిత్తం నిత్యం అనేక మంది రోగులు వచ్చే ఆసుపత్రికి నిన్న ఒక మహిళ ఆర్ధోపెడిక్ ఓపీ విభాగానికి వచ్చింది. చేతివేలు విరిగిపోవడంతో చికిత్స కోసం రాగా.. కట్టుకడుతున్న సమయంలో నర్సింగ్ ఉద్యోగి రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే కట్టు కట్టించుకున్న మహిళ తిరిగి వెళుతున్న సమయంలోనే జీజీహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ వార్డుకు వచ్చారు. ఆ మహిళ రోగిని పలకరించి.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
అయితే ఆ రోగి అన్ని బాగానే ఉన్నాయని.. కానీ సిబ్బంది లంచం అడగటంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పింది. దీంతో సూపరింటిండెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కట్టు కట్టిన నర్సింగ్ ఉద్యోగిని పిలిపించి, అనేక ప్రశ్నలు వేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఆమె అసలు జీజీహెచ్ ఉద్యోగే కాదని తేల్చారు. కాంతమ్మ అనేక మహిళ గత కొంతకాలంగా ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు నటిస్తూ రోగుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈరోజు కూడా కాంతమ్మే డబ్బులు అడిగినట్లు తేలింది. దీంతో కిరణ్ కుమార్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమెను ఎవరూ తీసుకొచ్చారో ఎప్పటి నుండి ఉద్యోగం చేస్తుందో తేల్చాలని విచారణకు ఆదేశించారు. అసలు ఉద్యోగులు కాని వాళ్ల వల్లే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందని కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంతమ్మను తక్షణమే జీజీహెచ్‌ను విడిచి పెట్టి వెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో వార్డులోని సిబ్బందిని కూడా హెచ్చరించారు. ఉద్యోగులు కాని వాళ్లు కూడా విధులు నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈరోజు ఆ మహిళా రోగి చెప్పకుంటే.. కాంతమ్మ ఆగడాలు ఇలాగే కొనసాగేవి కదా అని మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరిగితే వార్డు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.