కోటీశ్వరుణ్ని చేసిన టమటా.. ఏపీ రైతు విజయం
X
డబ్బులు ఎవ్వరికీ ఊరికేకిరావు... కొన్ని సార్లు కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రస్తుతం టమాటా రైతులకు మాత్రం ఆ అదృష్టం వరించిందినే చెప్పాలి. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గతవారం కాస్త తగ్గినట్టు కనిపించిన టమాట ధరలు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా టమాటా రైతులు కోటీశ్వరులవుతున్నారు. ఏపీకి చెందిన ఒక టమాటా రైతు కేవలం 45 రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇంత పెద్ద మొత్తంలో తనకు ఆదాయం వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
వివరాల్లోకెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో టమాటా రైతు 45 రోజుల్లోనే అక్షరాలా రూ.4 కోట్లు రాబట్టాడు. టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో టమాటా రైతు మురళి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన వేసిన టమాటా పంట సిరి సంపదను కురిపించింది. ఆయన పండించిన పంట మదనపల్లెలోని టమాటా మార్కెట్‌లోనే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకకు కూడా ఎక్కువ ధర పలుకడంతో టమాటాలను విక్రయించాడు. ఫలితంగా కోట్టు ఆర్జించాడు.
మురళి దంపతులు ఏప్రిల్‌లో కరకమండ్ల గ్రామంలోని 22 ఎకరాల భూమిలో టమోటా సాగు చేశారు. గత 45 రోజులలో, వారు 40,000 టమాట బాక్సులను విక్రయించారు. పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో గతంలో ఇదే కూరగాయ సాగు చేసిన రూ.1.5 కోట్ల అప్పులు తీర్చగలిగామని రైతు తెలిపారు. విద్యుత్ సరఫరా బాగుండడంతో ఈసారి దిగుబడి బాగా వచ్చిందని మురళి తెలిపారు. అయితే, టమాటా ధరలు బాగా పెరగడం అతిపెద్ద మలుపుగా మారింది. తమ అదృష్టం పడిందనీ, కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. "టమాటా ఇంత పెద్ద ఆదాయాన్ని ఇస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు" అన్నాడు టమాటా రైతు మురళి చెప్పారు. అతను లాభంలో కొంత భాగాన్ని ఉద్యానవన కార్యకలాపాలను విస్తరించడానికి పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు.