TTD : తిరుమలలో చిక్కిన మరో చిరుత.. కరెక్టుగా అదే ప్లేస్‌లో
X
తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం- 7వ మైలు మధ్య ప్రాంతంలో బోనులో బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీనితో కలిపి రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు పట్టుకున్నారు. 4 రోజుల క్రితమే ఈ చిరుత కెమెరా కంట పడింది. అప్పటినుంచి అధికారులు దాన్ని బంధించేందుకు చర్యలు చేపట్టారు.
గత నెలలో తిరుమల కొండపైకి నడకమార్గంలో వెళ్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలికను అలిపిరి వద్ద చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలుడిపై చిరుత దాడి చేసినా, అదృష్టవశాత్తు ఆ బాలుడు బతికిబయటపడ్డాడు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. దీనికితోడు నడక మార్గంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
గత నెలలోనే అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో మూడు చిరుతలు చిక్కాయి. దీంతో చిరుతల భయం పోయిందని భావించారు. గత నాలుగు రోజుల క్రితం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మరో చిరుత ఉన్నట్లు గుర్తించారు. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే, గురువారం తెల్లవారు జామున అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. అంతకుముందు చిక్కిన చిరుత కూడా నరసింహ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులోనే చిక్కుకుంది. ఇదిలా ఉంటే.. గత నెలలో బాలిక మృతి ఘటన తరువాత నడక మార్గంలో భక్తుల రద్దీ తగ్గింది.