Lokesh padayatra: లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత
X
యువగళం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా గునుపూడిలో జరిగిన లోకేశ్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గునుపూడికి లోకేశ్ రాకముందు నుంచే వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గునుపూడి బ్రిడ్జ్ వద్ద వైసీపీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలకు బలమైన గాయం తగిలింది. అదిగమనించిన పోలీసులు వెంటనే శ్రీనివాస్ ను హాస్పిటల్ కు తరలించారు.
అల్లరి మూకలు రాళ్ల దాడి చేస్తున్నా పోలీసులు నిలువరించలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అల్లరి మూకలు రాళ్ల దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్ వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము ఇలా అడ్డు పడి ఉంటే పాదయాత్ర చేసేవాడా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు సహకరించాలని పోలీసులను కోరారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు.