Home > ఆంధ్రప్రదేశ్ > YSR పీఏ సూరీడుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు

YSR పీఏ సూరీడుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు

YSR పీఏ సూరీడుపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
X

దివంగత నాయకుడు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడుపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. సూరీడుతో పాటు ప్రస్తుతం ఏపీలో ఐజీగా పని చేస్తున్న పాలరాజుపై, అలాగే మరో ఇద్దరు పోలీసు అధికారులుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సూరీడు అల్లుడు సురేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లాకు చెందిన పోతిరెడ్డి సురేందర్ రెడ్డికి, వైఎస్సార్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు కూతురుకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలం తరువాత దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో సూరీడి కూతురు తన భర్త సురేందర్ రెడ్డిపై వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. 2021 మార్చి 23వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో తన కూతురును చూసేందుకు సురేందర్ రెడ్డి.. జూబ్లీహిల్స్ లోని తన మామ సూరీడు నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ మామాఅల్లుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది.

అదే సమయంలో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు సురేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని, ఆయన చేతిలోని క్రికెట్‌ బ్యాట్‌ను, బైక్‌ను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు... ప్రస్తుతం ఏపీలో ఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజుతో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి, దాడికి పాల్పడ్డారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకొని, తనపై తప్పుడు కేసులు పెట్టిన సూరీడు, రాజశేఖర్‌రెడ్డి, నరేష్‌, పాలరాజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మంగళవారం మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకెళ్లాడు సురేందర్ రెడ్డి. జడ్జి ఆయన వాంగ్మూలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలంటూ బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 22 Sep 2023 5:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top