బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్లు బుగ్గిపాలు
X
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్ ప్రాంతంలోని టీవీఎస్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షోరూమ్‌తో పాటు గోదాంలో ఉన్న సుమారు 300 వరకు బైక్ లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.
గురువారం తెల్లవారుజామున షోరూమ్‌లోని ఫస్ట్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు గోడౌన్ కు విస్తరించాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న 3 ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. షోరూం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కావడంతో మంటలు వేగంగా విస్తరించినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
విజయవాడలోని స్టెల్లా కాలేజీ సమీపంలో టీవీఎస్ షోరూం ఉంది. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే హెడ్ ఆఫీస్ కావడంతో గోడౌన్ లో వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. బైక్ షోరూంతో పాటు సర్వీస్ సెంటర్‌ల కూడా ఇక్కడే ఉంది. ఒకే చోట గోడౌన్, షోరూం, సర్వీస్ సెంటర్ ఉండటంతో అగ్ని ప్రమాదం కారణంగా వందల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. గోడౌన్ లో టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెట్రోల్ వాహనాలను ఉంచే గోదాం సమీపంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేసి ఛార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.