ఏపీ రాజకీయాల్లో సంచలనం.. కొత్త పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ
X
ఏపీలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. జై భారత్ నేషనల్ పేరిట ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రత్యేక హెదా సాధన విషయంలో అన్నీ పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమాపేందుకు తమ పార్టీ పనిచేస్తుందన్నారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. అన్ని వర్గాలను కలిసి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. రాజకీయాలు అంటే మోసం కాదు సుపరిపాలన అన్నారు. ప్రస్తుతం వీళ్లు తిన్నారని వాళ్లు, వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన, పార్టీలు సరిగ్గా లేవు కాబట్టే జై భారత్ పుట్టిందన్నారు. జై భారత్ నేషనల్ అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తుందన్నారు. తమ పార్టీ ప్రజల్లోంచి పుట్టిందని.. తాము తప్పు చేయం.. అప్పు చేయమని స్పష్టం చేశారు.
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పార్టీతో ఎవరెవరు కలిసి వెళ్తారు..ఈ పార్టీ వల్ల ప్రస్తుతం ఎవరికి మేలు జరుగుతుందీ..ఎవరికి నష్టం చేస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల సమయంలో లక్ష్మీనారాయణ పార్టీ పెడతారని జోరుగా చర్చ నడిచింది. అయితే కొన్ని కారణలతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకుని.. జనసేన నుంచి పోటీ చేశారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడారు. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీ వైపు వెళ్లలేదు.