చంద్రబాబును కలిసిన యార్లగడ్డ వెంకట్రావు
X
వైసీపీని వీడిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై ఇరువురు కాసేపు చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ..కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కలిసి పనిచేద్దామని చెప్పారని వివరించారు. గన్నవరంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైసీపీకి రావడంతో తననను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడున్నర సంవత్సరాలుగా తనతో పాటు తన వర్గం పడుతున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించినట్టు యార్లగడ్డ స్పష్టం చేశారు. తనకు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా ఇష్టమని అయితే తనపై ఆతడే ఆరోపణలు చేయడం బాధ కలిగించందన్నారు.
వైసీపీలో మన ఇష్టాలతో పనిలేదని విమర్శించారు. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదని.. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశానన్నారు.హైదరాబాద్ అభివృద్ధి పాత్రలో చంద్రబాబునాయుడిది కీలక పాత్ర అని కొనియాడారు. రాష్ట్రప్రయోజనాల కోసమే ఆయన ఆలోచిస్తారని ప్రశంసించారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తానని, గుడివాడలో చేయమన్నా చేస్తానని స్పష్టం చేశారు.ఈ నెల 22న గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పుకోనున్నారు.