లంక గ్రామాలను ముంచెత్తుతున్న గోదావరి
లంక గ్రామాలను ముంచెత్తుతున్న గోదావరి
X
లంక గ్రామాలను ముంచెత్తుతున్న గోదావరి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. నీటిమట్టం పెరుగుతుండడంతో డ్యామ్ ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కట్ట కింద ఉన్న గ్రామాలు జలమయం అయిపోతున్నాయి. నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు వరదనీటిలో నానుతున్నాయి. పడవల మీద తిరిగే పరిస్థితిలో ఉన్నారు అక్కడ జనం.
తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. 11.10 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. ఇప్పటికే అధికారులు డామ్ తాలూకా 175 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేశారు. మొత్తం 8.98 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో నాలుగు రోజులుగా లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇక్కడ ప్రజానీకం నాటు పడవలపైనే ప్రయాణిస్తోంది. ఇళ్ళల్లోకి కూడా నీళ్ళు వచ్చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇంకో మూడు రోజులు భారీ వర్సాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. ఇదే కనుక నిజమైతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఒక్క గోదావరి పరిస్థితే కాదు. దేశంలో అన్ని చోట్లా విపరీతంగా వర్షాలు పడుతుండడం వలన దాదాపు అన్ని నదులూ పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో గంగానది, ఢిల్లీలో యమున ల్లో ప్రవాహ ఉధృతి ఇంకా తగ్గలేదు. మరోవైపు కర్నాటకలో తుంగాభద్రానదిది కూడా ఇదే పరిస్థితి. తుంగభద్ర జలాశయం ఇన్ ఫ్లో 55,657 క్యూసెక్కులు కాగా.. ఒక్కరోజులోనే ఐదు టీఎంసీలు డ్యామ్‌లో చేరాయి. డ్యామ్‌లో ప్రస్తుతం 21.36 టీఎంసీలకు చేరుకుంది.
మరోవైపు చింతూరు మండలం కుయిగూరు దగ్గర వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో వస్తున్న ప్రయివేటు ట్రావెల్ బస్సు నీటిలో నిలిచిపోయింది. వరద నీరు ఉన్నా దాటించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే సకాలంలో ప్రయాణికులు బస్ నుంచి దిగిపోవడంతో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. ప్రొక్లెయినర్ సహాయంతో బస్సును అధికారులు బయటకు తీయించారు.