Galla jayadev: బలంగా మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతా
X
ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు గుంటూరు ఎంపీ, తెలుగు దేశం పార్టీ నేత గల్లా జయదేవ్(Galla jayadev). అయితే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావట్లేదని, వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు తిరిగి వచ్చినంత బలంగా మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతానని స్పష్టం చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో గల్లా జయదేవ్ ఈరోజు గుంటూరులో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో.. రాజకీయాల్లో ఉండడం ద్వారా వివాదాలు వస్తున్నాయని, అందుకే తాను వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్ లో మౌనంగా ఉండలేను. నా పని పూర్తిగా నిర్వహించ లేకపోతున్నాను. 2024లో మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను. కానీ, రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. రెండేళ్ల క్రితం వ్యాపారాల నుంచి మా నాన్న రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు, వ్యాపారాన్ని సమన్వయం చేయడం కష్టంగా మారింది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా.' అని తెలిపారు.
రాజకీయాలు ఒకసారి వదిలేస్తే మళ్లీ రావడం కష్టమని కొందరు అంటున్నారని.. కానీ మళ్లీ అవకాశం వస్తే తిరిగి పోటీ చేస్తానని తెలిపారు. పార్టీకి రాజీనామా చేయడం లేదని వెల్లడించారు. రాజకీయాలు, వ్యాపారాలపై ఒకేసారి దృష్టి పెట్టడం కష్టమని, ప్రజలను కలవలేకపోతున్నానని ఆయన అన్నారు. తాను ఇప్పటివరకు పార్లమెంట్‌లో యాక్టివ్‌గా ఉన్నానని, ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని ఒత్తిడి తెచ్చానని చెప్పారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ జరిగిన అమరావతి రైతుల ఆందోళనలో తాను చురుగ్గా పాల్గొన్నానని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగుంటే పరవాలేదని, అవి దెబ్బతినే విధంగా ఉంటే మాత్రం ఇబ్బంది పడతామని అన్నారు. పదేళ్లు తాను ప్రజలకు సేవ చేశానని, ఇప్పుడు బ్రేక్ తీసుకుంటానన్నారు.