తన పార్టీని తానే తక్కువ అంచనా వేసుకుంటున్నాడు.. హరిరామ జోగయ్య
తన పార్టీని తానే తక్కువ అంచనా వేసుకుంటున్నాడు.. హరిరామ జోగయ్య
X
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య స్పందించారు. టికెట్ల కేటాయింపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆదివారం సంచలన లేఖ రాశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరుగలేదని అసహనం వ్యక్తం చేశారు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అంత హీన పరిస్థితిలో ఉందా? అని అడిగారు. జనసేన శక్తిని స్వయంగా పవన్ కల్యాణే తక్కువ అంచనా వేసుకుంటున్నారని గుర్తుచేశారు. 24 సీట్ల కేటాయింపు జనసేనను సంతృప్తి పరచలేదని అన్నారు. వాళ్లు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారు.. పవన్ కల్యాణ్‌ను రెండున్నరేళ్లు సీఎంగా చూడాలనేది జనసైనికుల కోరిక అని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడించగలరు అని అన్నారు.
హరిరామ జోగయ్య మాత్రమే కాదు.. జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంపై కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించేలా జనసేనకు సీట్ల కేటాయింపు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పవన్ వెంటనే స్పందించాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడని, సీట్ల సంఖ్య పెంచకపోతే టీడీపీకి ఓటు వేసేదే లేదని తేల్చి చెబుతున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.